కర్నూలు జిల్లాకు అరుదైన రికార్డు!
నేడు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా కర్నూలుకు విచ్చేస్తున్నారు. ఈ పైలట్ ట్రైనింగ్ అకాడమీ అందుబాటులోకి రావడంతో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలి పైలట్ ట్రైనింగ్ హబ్‌గా కర్నూలు జిల్లా సరికొత్త రికార్డును నెలకొల్పనుంది. విమానయాన రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే యువతకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారడమే కాకుండా, రాయలసీమ నుంచి భవిష్యత్ పైలట్లు తయారయ్యే మార్గం సుగమమైంది.
విమానాశ్రయం నుంచి ఏవియేషన్ హబ్ దిశగా..
ఇప్పటికే కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయం అందుబాటులోకి వచ్చి ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఎయిర్‌పోర్ట్ వేదికగా ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ కూడా రావడం జిల్లా స్థాయిని మరింత పెంచింది. ఈ కేంద్రం రాకతో ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు విస్తరించడంతో పాటు స్థానికంగా సాంకేతిక, రవాణా రంగాల్లో పరోక్షంగా ఎన్నో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
పరిశ్రమల కేంద్రంగా మారుతున్న సీమగడ్డ
రాయలసీమ అంటే కేవలం వ్యవసాయం, కరవు ప్రాంతం మాత్రమే కాదనే భావనను చెరిపేస్తూ, పారిశ్రామికంగా జిల్లా దూసుకుపోతోంది. ఇటీవల ప్రముఖ కార్పొరేట్ దిగ్గజ సంస్థ 'క్యాంపా కోలా' (Campa Cola) వంటి భారీ తయారీ పరిశ్రమ కర్నూలు గడ్డపై తమ కార్యకలాపాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పారిశ్రామిక ప్రాజెక్టులతో పాటు విమానయాన శిక్షణ సంస్థ కూడా కర్నూలుకే రావడంతో జిల్లా రూపురేఖలు మారిపోతున్నాయి.
కూటమి సర్కార్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో రాయలసీమ ప్రాంతం పెట్టుబడులకు, అత్యాధునిక మౌలిక వసతులకు అసలైన కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. కర్నూలు జిల్లా సాధిస్తున్న ఈ సరికొత్త ఘనతపై స్థానిక ప్రజలు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు