నా జ్ఞాపకాలు: భయపెట్టిన 'అరుంధతి'!

childhood hostel memories arundhati movie memories telugu blog


 ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అనేది ఎప్పటికీ తిరిగి రాని ఒక మధురమైన తీపి గుర్తు. కాలం చక్రంలా తిరుగుతూ 20 ఏళ్లో, 30 ఏళ్లో దాటిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. మోముపై తెలియని చిరునవ్వు పూయించేవి ఆ చిన్ననాటి జ్ఞాపకాలే. అందరికీ వాళ్ల బాల్యంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి. కానీ నా విషయానికి వస్తే, నా బాల్యమంతా ఎదోక సినిమాతో ముడిపడిపోయిన ఒక విచిత్రమైన ప్రయాణంలా అనిపిస్తుంది.

అలాంటిది.. ఈరోజు రాత్రి ఎందుకో తెలియదు, సరిగ్గా 17 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాను!


రీసెర్చ్.. రాత్రి 8 గంటల సమయం

రోజూలాగే న్యూస్, ఆర్టికల్స్ కోసం తీవ్రంగా రీసెర్చ్ చేస్తున్నాను. సమయం చూస్తే అప్పుడే రాత్రి 8:00 అయింది. అసలే కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆరాటంలో నాకు టైం ఎలా గడిచిపోతుందో నాకే తెలీదు.

ఇంతలో మా ఆవిడ వచ్చి, "అన్నం తినడానికి రావచ్చు కదా, ఎంతసేపు ఆ రీసెర్చ్?" అంటూ పిలిచింది. "సరే" అని లేచి వెళ్లి అన్నం తినడానికి కూర్చున్నాను. అప్పటికే మా నాన్నగారు టీవీ చూస్తున్నారు. నాతో పాటు తినడానికి మా అమ్మ కూడా సిద్ధమైంది. మా ఆవిడ వేడివేడిగా అన్నం వడ్డించి, ప్లేట్ నా ముందు పెట్టి తను కూడా పక్కనే కూర్చుంది. నేను ముద్ద నోట్లో పెట్టుకుంటూ అలా టీవీ వైపు చూశాను. టీవీలో 'అరుంధతి' సినిమా వస్తోంది. సరిగ్గా అదే సమయానికి.. "ఎంత దీక్ష పూనినావమ్మా.. జేజమ్మ!" అంటూ ఆ ఎవర్ గ్రీన్ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో మొదలైంది. ఆ పాట వింటూ, అన్నం తింటున్న నేను.. ఒక్క క్షణంలో ఈ లోకాన్ని మరిచిపోయి 17 ఏళ్ల వెనక్కి వెళ్లి, నా 9వ తరగతి రోజుల్లోకి జారుకున్నాను!


స్మశానాల మధ్య హాస్టల్.. భయం భయంగా రాత్రులు!

అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నా. మా ఊరికి కాస్త దూరంలో ఉండే మేడతూరు హాస్టల్‌లో ఉండేవాడిని. హాస్టల్ అంటే ఏదో పెద్ద బిల్డింగ్ అనుకుంటే పొరపాటే! ఊరికి బాగా దూరంగా, చుట్టూ చిల్లకంప చెట్లు, వాటి మధ్యలో స్మశానాలు.. కనీసం కాంపౌండ్ వాల్ కూడా లేని ఒక నిర్మానుష్య ప్రదేశం. పొద్దున పూట అంతా బాగానే ఉండేది కానీ, రాత్రి ఎనిమిది దాటిందంటే చాలు.. గాలికి చెట్లు కదిలినా గుండెల్లో గుబులు మొదలయ్యేది. అందరం భయం భయంగా ముసుగు తన్ని పడుకునేవాళ్ళం. అయితే, ఆ మేడతూరులో ఒక సినిమా టాకీస్ ఉండేది. అది కూడా పక్కా 'టూరింగ్ టాకీస్'! పగటిపూట ఆటలు ఉండవు, కేవలం రాత్రిపూట మాత్రమే ప్రదర్శన.


పశుపతి భయం.. "బొమ్మాలి నిన్ను వదల!"

ఆ సమయంలోనే 'అరుంధతి' సినిమా విడుదలై రాష్ట్రమంతా ఊపేస్తోంది. మా హాస్టల్ ఫ్రెండ్ ఒకడు ఎలాగోలా ఆ సినిమా చూసొచ్చి, మరుసటి రోజు హాస్టల్‌లో స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. వాడు చెప్తుంటేనే మాకు ఒళ్లు గగుర్పొడిచేది! "అరేయ్ బావా.. సినిమాలో ఒక పెద్ద కోట ఉంటుందిరా. అందులో పశుపతి అనే భయంకరమైన దెయ్యం ఉంటాడు. వాడు 'అమ్మా లే.. బొమ్మాలీ..' అంటూ డైలాగ్ కొడితే థియేటర్‌లో అందరికీ చెడ్డీలు తడిసిపోయాయి రా!" అంటూ వాడు కళ్లకు కట్టినట్లు చెప్పేవాడు. వాడు చెబుతున్న మాటలకే మాకు దడ పుట్టేది. తీరా చూస్తే, మరుసటి రోజే ఆ టూరింగ్ టాకీస్‌లో 'అరుంధతి' పడింది. "వద్దురా బాబోయ్, మన హాస్టల్ ఉన్న స్థలం బాలేదు, ఆ సినిమా చూస్తే రాత్రి చస్తాం" అని నేను మొత్తుకుంటున్నా వినకుండా.. మా ఫ్రెండ్ నన్ను లాక్కెళ్లాడు. అసలే నైట్ 10 గంటల షో.. హాస్టల్‌లో స్టడీ అవర్ ఎగ్గొట్టి మరీ సినిమాకి వెళ్లాం!


థియేటర్‌లో గుండెదడ..

టాకీస్ లోపల కూర్చున్నాం. తెరపై పశుపతి అఘోరా గెటప్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, జేజమ్మ ఆగ్రహం చూస్తున్నంత సేపు లోపల ఒకటే రైళ్లు పరిగెడుతున్నాయి. 'ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను కదరా దేవుడా!' అని నాలో నేను వందసార్లు తిట్టుకున్నాను. సినిమా పూర్తయ్యేసరికి అర్ధరాత్రి 12:30 అయింది. థియేటర్ నుంచి బయటకు రాగానే జనాలు ఎవరి ఇళ్లకు వాళ్లు గబగబా వెళ్లిపోయారు. అసలు సినిమా అప్పుడు మొదలైంది మాకు! సమయం ఒంటిగంట కావస్తోంది. అటు చూస్తే అరుంధతి సినిమా చూసిన భయం.. ఇటు చూస్తే హాస్టల్ వార్డెన్ ఎక్కడ పట్టుకుంటాడో అన్న వణుకు. వీటన్నిటికీ మించి ఆ అర్ధరాత్రి పూట స్మశానాల మీదుగా నడుచుకుంటూ హాస్టల్‌కి వెళ్లాలి! కాళ్లలో వణుకు మొదలైంది. వెనక్కి వెళ్లలేం, ముందుకు పోలేం!


ఒలింపిక్స్ పరుగు పందెం మాదిరి..

ఏం జరిగినా సరే హాస్టల్ చేరుకోవాల్సిందేనని బిక్కుబిక్కుమంటూ దారిపట్టాం. దారిలో మనుషులు కాదు కదా, కనీసం మొరిగే కుక్క జాడ కూడా లేదు. చిమ్మచీకటి.. ఎక్కడో దూరం నుంచి నక్కలు ఊళ వేస్తున్న శబ్దాలు!

మా ఫ్రెండ్ నా చెయ్యి గట్టిగా పట్టుకుని, "ఒరేయ్ బావా.. చాలా భయమేస్తుందిరా!" అన్నాడు వణుకుతున్న గొంతుతో.

"నాకూ కూడా అలాగే ఉంది రా" అన్నాను నేను. 

ఇక అంతే! ఇద్దరం ఒక్కసారిగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. ఒలింపిక్స్‌లో పరుగు పందెం మొదలైనట్లు.. ఆ టాకీస్ దగ్గర స్టార్ట్ చేసిన పరుగు, మధ్యలో ఎక్కడా వెనక్కి తిరిగి చూడకుండా, రొప్పుతూ రొప్పుతూ హాస్టల్ రూమ్ తలుపు తీసేవరకు ఆగలేదంటే నమ్మండి! లోపలికి వెళ్లి దుప్పటి ముసుగేసుకున్నాక గానీ ప్రాణం లేచి రాలేదు.


ఇప్పుడు ఇదంతా జరిగి 17 ఏళ్లు గడిచిపోయాయి. పెళ్లయి, బాధ్యతలు పెరిగి, ఇంత పెద్దవాడినై.. టీవీలో ఆ పాట చూస్తూ కూర్చుంటే మాత్రం, నా మనసంతా మళ్లీ ఆ 9వ తరగతి రోజుల్లోకే వెళ్లిపోయింది. ఆ రాత్రి పరుగు, ఆ అమాయకత్వం, ఆ భయం తలచుకుంటే ఇప్పటికీ నా పెదవులపై తెలియని నవ్వు మెదులుతోంది. నిజంగా బాల్యపు జ్ఞాపకాలు ఇచ్చే ఆనందం జీవితంలో ఇంకేదీ ఇవ్వలేదు.

ఇలాంటి సరదా సినిమా జ్ఞాపకాలు నా జర్నీలో ఇంకా చాలానే ఉన్నాయి లెండి.. ముందు ముందు 'నా జ్ఞాపకాల్లో' బోలెడు మాట్లాడుకుందాం!

                        - రైటర్ ఎం.కె

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.