మరో ఆరు నెలల్లో 4.5 లక్షల మరణాలు.. భారత్‌కు తీవ్ర హెచ్చరిక!
ప్రపంచానికి ‘సూపర్ ఎల్ నినో’ ముప్పు:
భూగోళాన్ని వాతావరణ మార్పులు తీవ్రంగా వణికిస్తున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడుగా ‘సూపర్ ఎల్ నినో’ (Super El Niño) ప్రభావం తోడవడంతో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో తీవ్ర వేడిగాలులు (Heatwaves) వీచే ప్రమాదం ఉందని అంతర్జాతీయ పర్యావరణ పరిశోధనా సంస్థ ‘క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్’ (Climate Impact Lab) హెచ్చరించింది. ఈ విపరీతమైన ఎండల తీవ్రత కారణంగా రానున్న ఆరు నెలల కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,51,000 అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని తాజా నివేదికలో వెల్లడించింది.
గ్లోబల్ సౌత్ దేశాలపైనే తీవ్ర ప్రభావం:
ఈ ఉష్ణతాపం ప్రభావం ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు ఎక్కువగా ఉన్న ‘గ్లోబల్ సౌత్’ (Global South) ప్రాంతాలపైనే అధికంగా పడనుందని అధ్యయనం స్పష్టం చేసింది. వైద్య సదుపాయాలు, కూలింగ్ వ్యవస్థలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు వడదెబ్బ, డీహైడ్రేషన్ బారినపడే ప్రమాదం ఎక్కువని పేర్కొంది.
వివిధ ప్రాంతాల్లో అంచనా వేసిన మరణాల వివరాలు:
సాహెల్ ప్రాంతం (ఆఫ్రికా): 66,800 మరణాలు
ఆగ్నేయాసియా: 19,400 మరణాలు
ఇండోనేషియా: 19,300 మరణాలు
భారత్: సుమారు 15,800 అదనపు ఉష్ణ సంబంధిత మరణాలు
బ్రెజిల్: 13,300 మరణాలు
భారతదేశంలో వచ్చే వేసవి మరియు శీతాకాలంలో కూడా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదై తీవ్ర వాతావరణ పరిస్థితులు తలెత్తే అవకాశముందని నివేదిక హెచ్చరించింది.
ఫిబ్రవరి 2027 వరకు కొనసాగే ఛాన్స్: డబ్ల్యూఎంఓ హెచ్చరిక:
ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఎల్ నినో ప్రభావం నవంబర్ - డిసెంబర్ నాటికి మరింత తీవ్రరూపం దాల్చనుంది. ఈ విపరీత వాతావరణ పోకడలు అంతటితో ఆగకుండా ఫిబ్రవరి 2027 వరకు కొనసాగే అవకాశాలు బలంగా ఉన్నాయని డబ్ల్యూఎంఓ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీనివల్ల వ్యవసాయం, తాగునీటి లభ్యత, ఆహార భద్రతపై పెను ప్రభావం పడే ముప్పు ఉంది.
తీవ్రమవుతున్న ఎండల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలు తక్షణమే ఎమర్జెన్సీ హీట్ యాక్షన్ ప్లాన్‌లను సిద్ధం చేయాలని, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను బలోపేతం చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.

కామెంట్‌లు లేవు