పోలీసులకు సినిమా చూపిస్తా: వైయస్ జగన్
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల సమరానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే ఎన్నికలను ఒక యుద్ధంలా స్వీకరించి పోరాడాలని, పార్టీ కార్యకర్తలకు నాయకత్వం కొండంత అండగా నిలబడుతుందని ఆయన భరోసా ఇచ్చారు.
అన్యాయం చేసే అధికారుల పేర్లు డిజిటల్ డైరీలోకి:
కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి చట్టవిరుద్ధంగా వ్యవహరించే అధికారులపై జగన్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. "ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తూ, అన్యాయంగా వ్యవహరించే పోలీసు అధికారులను ఎవరినీ వదిలిపెట్టొద్దు. వారి పేర్లను, చేసిన అక్రమాలను తక్షణమే డిజిటల్ డైరీలో నమోదు చేయండి" అని క్యాడర్‌కు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్క అధికారి లెక్క తేలుస్తామని, న్యాయం ఎలా పనిచేస్తుందో అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తామని ఘాటుగా హెచ్చరించారు.
జగన్ 2.0 లో కార్యకర్తలే సుప్రీం:
పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న కార్యకర్తలకు పార్టీ పూర్తి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఏర్పాటయ్యే ‘జగన్ 2.0’ ప్రభుత్వంలో కార్యకర్తే నంబర్ వన్ అని, వారి త్యాగాలకు, శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం దక్కుతాయని స్పష్టం చేశారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, అధికార పక్షం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ధైర్యంగా ఎదుర్కొని బరిలో నిలబడాలని పిలుపునిచ్చారు.

కామెంట్‌లు లేవు