రిలీజ్ కు ముందే గిన్నిస్ రికార్డు.. 'రాకా' సంచలనం!
భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి మారుమోగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘రాకా’ (Raaka) విడుదలకు ముందే సరికొత్త చరిత్ర సృష్టించింది. సాంకేతిక రంగంలో అరుదైన మైలురాయిని అధిగమించి, ప్రతిష్టాత్మక ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’ (Guinness World Records)లో చోటు దక్కించుకుంది.
ఒకేసారి 37 మంది నటులతో ‘రియల్ టైమ్ మోషన్-క్యాప్చర్’!
సినిమా చిత్రీకరణలో భాగంగా అత్యాధునిక వీఎఫ్ఎక్స్ (VFX) టెక్నాలజీని ఉపయోగించి ఒకే సెషన్‌లో ఏకకాలంలో ఏకంగా 37 మంది నటులపై 'రియల్ టైమ్ మోషన్-క్యాప్చర్' (Real-Time Motion-Capture) నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో ఇంతమంది పెర్ఫార్మర్లను ఒకేసారి మోషన్-క్యాప్చర్ చేయడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి. ప్రపంచ సినీ చరిత్రలోనే కనివినీ ఎరుగని ఈ సాంకేతిక విన్యాసానికి గుర్తింపుగా ‘మోస్ట్ పీపుల్ మోషన్-క్యాప్చర్డ్ ఇన్ రియల్-టైమ్’ విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ధ్రువీకరణను అందించింది.
సర్టిఫికెట్ అందుకున్న అల్లు అర్జున్, అట్లీ
ఈ అరుదైన ఘనతకు సంబంధించిన సర్టిఫికెట్‌ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల నుంచి హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ సంయుక్తంగా అందుకున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. “భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టిన చారిత్రక విజయం” అంటూ మేకర్స్ పేర్కొనడంతో నెట్టింట ఈ ఫొటోలు, పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

కామెంట్‌లు లేవు