Tollywood hit formula: కథ ఒక్కటే.. సినిమాలెన్నో!

Pushpa Peddi The Paradise Movie Formulas Tollywood Cinema Analysis


సినిమా పరిశ్రమలో ఒక ఫార్ములా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిందంటే చాలు.. అదే టెంప్లేట్‌తో వరుసగా సినిమాలు తెరపైకి వస్తుంటాయి. అలా వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకులను అలరించి ఇండస్ట్రీ హిట్లుగా, ఆల్-టైమ్ క్లాసిక్స్‌గా నిలిచాయి. దర్శకులు మారినా, నేపథ్యాలు మారినా.. కథలోని మూల సూత్రం (Core Soul) ఒక్కటే అయినప్పటికీ, స్క్రీన్‌ప్లేతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందర్భాలు సినీ చరిత్రలో చాలానే ఉన్నాయి.

'భాషా' మొదలు.. ఫ్యాక్షన్ ఇండస్ట్రీ హిట్ల వరకు:

గతంలో రజినీకాంత్ 'భాషా' చిత్రం సృష్టించిన సంచలనం భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయి. ఆ సినిమాలో హీరో బయటకు అమాయకమైన ఆటో డ్రైవర్‌గా కనిపిస్తాడు. కానీ ఇంటర్వెల్ లేదా ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్‌తో అసలు కథ రివీల్ అవుతుంది. ఇదే టెంప్లేట్ మరియు సోల్ పాయింట్‌ను తీసుకుని టాలీవుడ్‌లో వచ్చిన 'సమరసింహారెడ్డి', 'ఇంద్ర' లాంటి చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి.

లేటెస్ట్ ట్రెండ్: 'ఐడెంటిటీ' పోరాటం – సుక్కు మార్క్!

ఇటీవలి కాలంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టించిన టెంప్లేట్ "ఐడెంటిటీ కోసం పోరాటం". లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' ( Pushpa ) చిత్రం ఈ తరహా కథాంశానికి నిలువెత్తు నిదర్శనం. తనకు దక్కని ఇంటి పేరు కోసం, సమాజంలో గుర్తింపు కోసం ఓ సాధారణ కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్.. ఎర్రచందనం సిండికేట్ సామ్రాజ్యాన్నే ఏలే స్థాయికి ఎదుగుతాడు.

విశేషమేమిటంటే.. సుకుమార్ శిష్యులు సైతం గురువు బాటలోనే నడుస్తూ, ఇదే కోర్ టెంప్లేట్‌ను వేర్వేరు రంగాలకు అన్వయించి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుండటం గమనార్హం. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' ( peddi ) చిత్రంలోనూ ఇదే తరహా లైన్ కనిపిస్తుంది. ఓ ఆటకూలీగా మొదలైన యువకుడు.. క్రీడారంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, తన పల్లెటూరికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తాడు. ఇక మరో శిష్యుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన 'ది ప్యారడైజ్' ( the paradise ) చిత్రంలో కూడా అస్తిత్వ పోరాటమే కనిపిస్తుంది. తన ప్రాంతం, తన జాతి ప్రజలకు ఒక సరైన గుర్తింపు, ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టేందుకు ఒక సామాన్యుడు తిరుగుబాటు నాయకుడిగా ఎలా ఎదిగాడనేది మూవీ మెయిన్ స్టోరీ.

టెంప్లేట్ ఒక్కటే.. మరి తేడా ఎక్కడుంది?

కథా మూలం ఒక్కటే అయినప్పటికీ.. దర్శకుడు ఎంచుకున్న నేటివిటీ, పాత్రల భావోద్వేగాలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయి. టెంప్లేట్ హిట్టయితే "క్లాసిక్ ఎమోషన్, పక్కా మాస్ మీటర్" అంటూ ప్రశంసల జల్లు కురుస్తుంది. ట్రీట్‌మెంట్ మిస్సయితే "మళ్లీ అదే పాత చింతకాయ పచ్చడి కథ" అంటూ తీవ్ర విమర్శలు తప్పవు.

మొత్తానికి, భాషా నాటి అజ్ఞాతవాసం ఫార్ములా నుంచి నేటి పుష్ప, పెద్ది, ప్యారడైజ్ చిత్రాల 'ఐడెంటిటీ క్రైసిస్' టెంప్లేట్ వరకు.. కథ పాతదే అయినా, దానికి అందించే ఎమోషన్, ఎలివేషన్ కొత్తగా ఉంటే బాక్సాఫీస్ ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటుందని మరోసారి రుజువైంది.

Blogger ఆధారితం.