కేటీఆర్‌కు కవిత డైరెక్ట్ వార్నింగ్!
భారత్ రాష్ట్ర సమితి (BRS) కుటుంబంలో, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తన సోదరుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి కవిత చేసిన ఘాటైన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ వైఫల్యాలను గులాబీ అధినేత కేసీఆర్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె నేరుగా మన అన్నపై విరుచుకుపడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
"గుంటనక్క మైండ్ గేమ్‌లో పడ్డావ్"
ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ.. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అని, స్థానిక వ్యవహారాల్లో వేరే నేతలు జోక్యం చేసుకోవద్దని కేసీఆర్ చెప్పడం వల్లే పార్టీ గత ఎన్నికల్లో నష్టపోయిందనే అర్థం వచ్చేలా మాట్లాడడం సరి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు "ఎవరో ఒక గుంటనక్క ఆడుతున్న మైండ్ గేమ్‌లో పడి, పార్టీని స్థాపించి నిలబెట్టిన పెద్ద మనిషి కేసీఆర్‌నే తప్పు పడుతున్నావ్. మీ అసమర్థతను, మీ చేతగానితనాన్ని అధినేతపై మోపుతారా?" అంటూ కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "నిమజ్జనం ఊరేగింపుల్లో డబ్బులిచ్చి మరీ కేసీఆర్ పాటలు పెట్టించారన్న నిజం మీ అంతరాత్మకు తెలుసు. నేను ఏది మాట్లాడినా పూర్తి ఆధారాలతోనే మాట్లాడతాను" అని తేల్చిచెప్పారు.
'నాతో పెట్టుకోకు' అంటూ హెచ్చరిక: అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలపై తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, అనవసరంగా తనతో పెట్టుకోవద్దంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి హెచ్చరించడం గమనార్హం.
బయటపడ్డ బీఆర్‌ఎస్ అంతర్గత లొసుగులునేను మీ పార్టీలో ఒక్క అవినీతి గుంటనక్కను విమర్శిస్తేనే.. కొన్ని గంటల్లో పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 29, 2026
అదే గుంటనక్కతో అంటకాగుతూ మీ పార్టీ అధినేత తీరుతోనే నష్టపోయామని మీరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పార్టీ వ్యతిరేకం కాదా?
మీరు మీ పార్టీ అధినేత *KCR* గారిని విమర్శించడం.. ఆయన… pic.twitter.com/KsbRqhY7tZ
ఈ వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గతంగా నాయకత్వ వివాదాలు, ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉన్నాయో మరోసారి బహిర్గతమయ్యాయి. గతంలో పార్టీ విధానాలు, నాయకత్వ నిర్ణయాలు నచ్చకనే తాను బయటకు వచ్చినట్లు కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. కేవలం కేటీఆర్ మాత్రమే కాకుండా, గతంలో హరీష్ రావుతో పాటు స్వయంగా అధినేత కేసీఆర్ రాజకీయ నిర్ణయాల తీరును కూడా ఆమె విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ పూర్వవైభవం కోసం శ్రమిస్తున్న సమయంలో.. సాక్షాత్తూ కేసీఆర్ కుమార్తె ఇలా బాహాటంగా కేటీఆర్ పనితీరును, నిర్ణయాలను తప్పుపట్టడం పార్టీ శ్రేణులను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది.
ఓటమి బాధ్యత ఎవరిది?
తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి టికెట్ల కేటాయింపు, ఎమ్మెల్యేల మితిమీరిన స్వేచ్ఛే కారణమని కేటీఆర్ ఒకవైపు వాదిస్తుండగా.. అసలైన నాయకత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్‌పై నెపం నెడుతున్నారని కవిత వర్గం ఎదురుదాడి చేస్తోంది. భవిష్యత్ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పగ్గాలపై ఎవరి ఆధిపత్యం ఉండాలనే దానిపై తెరవెనుక బలమైన అంతర్గత సమరం నడుస్తోందనడానికి కవిత తాజా వ్యాఖ్యలే నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.
సొంత చెల్లెలి నుంచే ఇంత బహిరంగంగా, తీవ్ర విమర్శలు ఎదురుకావడం కేటీఆర్‌కు రాజకీయంగా ఇబ్బందికర పరిణామమే. ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ లేదా బీఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ నేతలు ఎలా సమాధానమిస్తారు? ఈ విభేదాలు గులాబీ పార్టీ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తాయి? అనేది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠభరితంగా మారింది.

కామెంట్‌లు లేవు