మళ్లీ వైసీపీలోకి షర్మిల?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబం చుట్టూ తిరిగే సమీకరణాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తిరిగి తన సొంత గూడైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గత కొద్ది రోజులుగా నెట్టింట సాగుతున్న ఈ ప్రచారంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, వాస్తవ పరిస్థితులు, గత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఆమె తిరిగి వైసీపీ బాట పట్టడం దాదాపు అసాధ్య మే.
అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ, వ్యక్తిగత అగాధం:
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్ షర్మిలకు మధ్య కేవలం రాజకీయ విభేదాలే కాకుండా తీవ్రమైన వ్యక్తిగత, ఆస్తిపరమైన విభేదాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కడప లోక్‌సభ స్థానం వేదికగా జరిగిన పోరు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ, అనంతరం వైసీపీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా షర్మిల ప్రభుత్వంపై, జగన్ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇలాంటి బలమైన విభేదాల నేపథ్యంలో ఆమె తిరిగి వైసీపీలో చేరడం అనేది ఊహాజనితమే.
ప్రచారానికి కారణమైన కుమార్తె వివాహం:
వైఎస్ షర్మిల కుమార్తె వివాహం త్వరలో జరగనుండటంతో, వివాహ ఆహ్వాన పత్రికను అందించేందుకు ఆమె జగన్‌ను కలవబోతున్నారన్న వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సోషల్ మీడియాలో అన్నాచెల్లెళ్లు మళ్లీ రాజకీయంగా ఒక్కటవుతున్నారని, షర్మిల తిరిగి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారంటూ ప్రచారాన్ని తీవ్రం చేశారు. కుటుంబ వేడుకల అంశాన్ని రాజకీయ పునరేకీకరణతో ముడిపెడుతూ కథనాలు సృష్టించారు.
పుకార్లపై షర్మిల కుండబద్దలు:
ఈ వ్యవహారంపై కొనసాగుతున్న రాజకీయ గందరగోళానికి వైఎస్ షర్మిల తనదైన శైలిలో తెరదించారు. తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న వదంతులను ఆమె పూర్తిగా ఖండించారు. గతంలో తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు మాత్రమే జగన్‌మోహన్‌రెడ్డిని చివరిసారిగా కలిశానని, ఇప్పుడు కూడా కుమార్తె వివాహం కోసమే కలవనున్నట్లు స్పష్టం చేశారు. కేవలం కుటుంబ సంబంధాలు, సంప్రదాయాల మేరకే ఈ కలయిక పరిమితమని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తేల్చిచెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలిగా పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని కుండబద్దలు కొట్టారు.

కామెంట్‌లు లేవు