విమానాన్ని కూల్చేందుకు కో-పైలట్ కుట్ర.. ప్రాణాలకు తెగించి 180 మందిని కాపాడిన భారత పైలట్!

 

Indian pilot Captain Smith Machar saves Flydubai flight after co pilot attack

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానంలో ఊహించని భయానక ఘటన చోటుచేసుకుంది. గాల్లో ఉండగానే ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలిపేసేందుకు జరిగిన ఓ కుట్రను భారత పైలట్ ఒంటిచేత్తో అడ్డుకున్నారు. రక్తమోడుతున్నా వెనక్కి తగ్గకుండా, తీవ్రంగా గాయపడిన స్థితిలోనే విమానాన్ని సురక్షితంగా నేలకు దించి 180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా నిలిచారు.


గాల్లో ఏం జరిగింది?

దుబాయ్ నుండి ఇజ్రాయెల్ బయలుదేరిన 'ఫ్లైదుబాయ్' విమానం గాల్లో ఉండగా, ఒమన్‌కు చెందిన కో-పైలట్ ఒక్కసారిగా తోటి పైలట్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగాడు. విమానాన్ని కూల్చేయడమే లక్ష్యంగా అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఇజ్రాయెల్ మీడియా సంచలన విషయాలను వెల్లడించింది. అంతకుముందు విమానం హైజాక్‌‌కు గురైందంటూ వార్తలు వచ్చినప్పటికీ, ఇది పక్కా ప్లాన్‌తో కూడిన టెర్రర్ అటాక్ అని ప్రాథమిక కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ సమయంలో విమానంలో 100 మందికి పైగా ఇజ్రాయెల్ దేశస్థులతో కలిపి మొత్తం 180 మంది ప్రయాణికులు ఉన్నారు.


వెన్నుచూపని భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్

సహచర ఒమనీ పైలట్ కత్తితో పొడుస్తున్నా.. భారత సంతతికి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఏమాత్రం భయపడలేదు. రక్తమోడుతున్న శరీరంతోనే దుండగుడితో ప్రాణాలకు తెగించి పోరాడారు. ఈ ఘర్షణను గమనించిన ఇతర విమాన సిబ్బంది వెంటనే స్పందించి ఆ కో-పైలట్‌ను నిలువరించారు. తీవ్ర గాయాలపాలైనప్పటికీ సంయమనం కోల్పోకుండా, విమాన నియంత్రణను చేతుల్లోకి తీసుకున్న కెప్టెన్ స్మిత్.. విమానాన్ని సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) చేశారు. ప్రస్తుతం ఆయన సౌదీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

13 ఏళ్ల అపార అనుభవం

కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు కమర్షియల్ ఏవియేషన్ రంగంలో 13 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉంది. గతంలో భారతదేశానికి చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్ ‘స్పైస్‌జెట్’లో పనిచేసిన ఆయన, 2022లో ‘ఫ్లైదుబాయ్’ సంస్థలో చేరారు. ఆయన సుదీర్ఘ అనుభవం, సమయస్ఫూర్తి, మొక్కవోని ధైర్యమే నేడు పెను విషాదాన్ని తప్పించి వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపాయి.


దేశానికే గర్వకారణం: ప్రధాని మోదీ

కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన సాహసాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆయన దేశానికే గర్వకారణమని, నిజమైన హీరో అని ప్రశంసిస్తూ ఎక్స్‌లో (ట్విట్టర్) సందేశం ఉంచారు. ప్రాణాంతక పరిస్థితిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు వీరుడిలా పోరాడారని అభినందించారు. ఆయన చొరవతో వందల మంది ప్రాణాలు దక్కాయని చెబుతూ, కెప్టెన్ స్మిత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.