నా మాటల్లో..: పోలీసులు కాదు.. రక్షక'భక్షకులు'!
నమస్కారమండి అందరికీ!
నిన్న మన ‘కబుర్లు’లో ‘నా మాటల్లో..’ శీర్షిక రాయలేకపోయాను, కాస్త బిజీ వల్ల వీలుపడలేదు.. ముందుగా అందుకు మన్నించాలి. అయితే ఈరోజు మీతో ఏం కబుర్లు చెప్పాలా అని ఆలోచిస్తుండగానే, మా ఇంటి దగ్గరికి ఒకాయన వచ్చాడు. వరుసకు మావయ్య అవుతాడులేండి. రాగానే ముఖం చిన్నబోసుకుని, "అల్లుడూ.. నా మొబైల్ పోయిందిరా. నువ్వు టెక్నాలజీ బాగా తెలిసినోడివి కదా, ఎక్కడ పోయిందో కనిపెడతావని అందరూ చెప్పారు.. కాస్త చూసి పెట్టవా" అన్నాడు అమాయకంగా.
"దాందేముంది మామా.. నీ ఫోన్‌లోని జీమెయిల్ (Gmail) అకౌంట్‌తో లాగిన్ అయిన ఇంకో ఫోన్ ఏదైనా ఉంటే, గూగుల్ 'ఫైండ్ మై డివైస్' ఆన్ చేసి ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అది ఎవరైనా చేయొచ్చు" అన్నాను. దానికి ఆయన "అయ్యో.. ఆ జీమెయిల్ లాగిన్ అయిన మరో ఫోన్ ఏదీ లేదురా" అన్నాడు. "అలాగైతే మన చేతుల్లో ఏం ఉండదు మామా.. ఫోన్ బాక్స్‌పై ఉండే IMEI నంబర్లు పట్టుకుని ఓసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చి చూడు, పని కాకపోతే తర్వాత ఆలోచిద్దాం" అని చెప్పి ఆయనను పంపించేశాను.
కానీ, ఆయన వెళ్లిన తర్వాత నాకు ఒక్కసారిగా గతం గుర్తొచ్చింది. నేను గతంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మీడియా ఛానల్లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న రోజుల్లో సరిగ్గా ఇలాంటి అనుభవమే ఒకటి ఎదురైంది. ఆ రోజుల్లో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం కంటే.. సైలెంట్‌గా ఇంకో కొత్త మొబైల్ కొనుక్కోవడమే నయం అన్నంత చిరాకు, విరక్తి వచ్చాయి.
అసలేం జరిగిందంటే..
ఒకరోజు మా అన్నయ్య ఊరి నుంచి హైదరాబాద్ వచ్చాడు. కేవలం నన్ను చూసి కాసేపు మాట్లాడి వెళ్దామని పల్లెటూరు నుంచి వచ్చాడామనిషి. దురదృష్టవశాత్తూ ఇక్కడికి వచ్చిన కాసేపటికే ఆయన మొబైల్ పోయింది. అది కూడా ముచ్చటపడి రూ.30,000 పెట్టి రీసెంట్‌గానే కొన్న కొత్త ఫోన్. ఇక చేసేది లేక బాధతో తిరిగి ఊరికి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ నాకు ఫోన్ చేసి, "తమ్ముడూ.. నా ఫోన్ బాక్స్ మీద ఉన్న IMEI నంబర్లు నీకు వాట్సాప్ చేస్తాను, కాస్త స్టేషన్‌కి వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వరా" అన్నాడు.
సరే అన్నయ్య ఫోనే కదా, ఎలాగైనా కనిపెట్టాలని ఉదయాన్నే దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. అక్కడ ఎస్సై గారి దగ్గరకు వెళ్లి విషయం చెబితే.. "ముందు ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి చెప్పు, కంప్లైంట్ రాసుకుంటాడు" అని పంపించాడు. సరేనని ఆ కానిస్టేబుల్ టేబుల్ దగ్గరకు వెళ్లాను.
అక్కడ మొదలైంది అసలు విచారణ!
"ఎప్పుడు పోయింది? ఎక్కడ పోయింది? ఎన్ని గంటలకు పోయింది? అప్పుడు నువ్వు ఏం చేస్తుంటివి?" అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించాడు. సరే ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడులే అని నేను ఓపికగా అన్నిటికీ సమాధానాలు చెప్పాను. చివరికి ఆ కానిస్టేబుల్ నా వైపు చూసి, "అసలు ఆ మొబైల్ నీదేనా?" అని అడిగాడు. "కాదండీ.. మా అన్నయ్యది" అన్నాను. దానికి ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండా.. "అయితే మీ అన్నయ్యను వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వమను" అన్నాడు.
నాకు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి! "సార్.. ఆయనది హైదరాబాద్ కాదు, చాలా దూరం పల్లెటూరు. నన్ను చూడటానికి మాత్రమే ఇక్కడికి వచ్చాడు. కేవలం ఈ కంప్లైంట్ కాగితం ఇవ్వడానికి ఆయన మళ్లీ అంత దూరం నుంచి ప్రయాణం పెట్టుకుని, ఖర్చు చేసుకుని ఇక్కడికి రావాలా?" అని అడిగాను.
దానికి ఆ కానిస్టేబుల్ అన్నమాటకి నా ఒంట్లో నరాలు కట్ అయిపోయినంత పనైంది! "ఇక్కడ మీ మొబైల్ దొరకాలంటే.. మా కోసం నువ్వు కూడా ఖర్చు చేయాల్సిందే" అన్నాడు సూటిగా. ఎంత ఖర్చు పెట్టాలి సార్ అని అడిగితే.. "ఫోన్ దొరికేదాకా ఖర్చు చేస్తూనే ఉండాలి" అని లైట్‌గా నవ్వాడు.
ఇంకేం మాట్లాడతాం చెప్పండి? చేతిలో ఉన్న కంప్లైంట్ లెటర్‌ను అలాగే మడతపెట్టి జేబులో పెట్టుకుని.. ఆ పోలీసోడికి నమస్తే చెప్పి సైలెంట్‌గా వెనక్కి వచ్చేశాను.
అదేంటో గానీ.. లంచం అడగడంలో, తీసుకోవడంలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని కొందరికి ఎవరూ సాటి రారేమో అనిపిస్తుంది. కనీసం మనం పబ్లిక్ సర్వెంట్లం కదా, ప్రజలకు న్యాయం చేయాల్సిన రక్షకభటులం కదా, బాధ్యత కూడా లేని వారిని ఏమనాలో చెప్పండి! ఇలా ఓపెన్‌గా లంచం అడిగితే జనం ఎలా రియాక్ట్ అవుతారో అన్న కనీస భయం, సంకోచం కూడా లేకుండా మొహం మీదే అడిగేస్తుంటారు. ప్రజల రక్షణ కోసం నిలబడాల్సిన వాళ్లే ఇలా వ్యవహరిస్తుంటే.. ఇక సామాన్యుడికి వ్యవస్థ మీద నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఈ రోజుల్లో పోలీసులంటే ప్రజల్లో ఉన్న భయం, గౌరవం రెండూ సన్నగిల్లుతున్నాయి. ఈ పోలీసు వ్యవస్థలో ఎప్పుడు మార్పు వస్తుందో ఏంటో..! ఇంత సంగతులు మళ్లీ కలుద్దాం!
-రైటర్ ఎం.కె

కామెంట్‌లు లేవు