జగన్ వ్యవహారం.. పార్టీకి నష్టమా లాభమా!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ వైఖరిపై దేశవ్యాప్తంగా ఎప్పటినుంచో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో కూర్చున్న అంతిమ మద్దతు మాత్రం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కే ఉంటుందనేది పొలిటికల్ సర్కిల్స్‌లో తరచూ వినిపించే మాట. తాజాగా ఎన్నికల కమిషనర్ల నియామకంపై ఆయన చేసిన ఒక ట్వీట్, దానికి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా ఇచ్చిన ఘాటైన కౌంటర్ జాతీయ స్థాయిలో వైఎస్సార్‌సీపీ రాజకీయ ప్రాధాన్యతను మరోసారి చర్చనీయాంశంగా మార్చాయి.
పార్లమెంట్‌లో కనిపించిన అనుకూలత:
వైఎస్ జగన్ (ys jagan ) నేతృత్వంలోని వైసీపీ గత ఐదేళ్ల పాలనలో కేంద్రానికి అవసరమైన ప్రతి కీలక సందర్భంలోనూ అండగా నిలిచింది. రాజ్యసభలో ఎన్డీయే ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లేని సమయంలో సైతం ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (CAA) వంటి అనేక వివాదాస్పద బిల్లులకు వైసీపీ బేషరతుగా ఓటేసింది. మరోవైపు విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన కీలక నిధుల కేటాయింపుల్లో కేంద్రం తీవ్ర జాప్యం చేసినప్పటికీ, జగన్ ప్రభుత్వం ఢిల్లీ పెద్దలతో ఎలాంటి ప్రత్యక్ష ఘర్షణకు దిగకుండా మైత్రి ధోరణినే అవలంబించింది. చివరకు అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష హోదాకు పరిమితమైన తర్వాత కూడా తీరు మారలేదనడానికి రీసెంట్ గా కేంద్రం ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రతిపాదనలకు వైసీపీ ఎంపీలు మద్దతు తెలపడమే నిదర్శనం.
ఎన్నికల కమిషనర్ల ట్వీట్.. మహువా మోయిత్రా సెటైర్:
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ), ఎలక్షన్ కమిషనర్ల నియామక ప్రక్రియపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. ఎన్నికల వ్యవస్థ స్వయంప్రతిపత్తిపై విపక్షాలు కేంద్రాన్ని తీవ్రంగా నిలదీస్తున్నాయి. ఈ సమయంలో జగన్‌మోహన్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ—"ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగాలి" అని ఒక ప్రకటన చేశారు. ఈ ట్వీట్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ముందు ట్వీట్ల సంగతి పక్కన పెట్టి.. పార్లమెంట్‌లో కేంద్రానికి అనుకూలంగా మద్దతు ఇవ్వడం మానేయండి" అంటూ పరోక్షంగా చురకలంటించారు.
జాతీయ స్థాయిలో వైఎస్సార్‌సీపీ పరిస్థితి ఏమిటి?
ఈ పరిణామాలు జాతీయ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ ప్రస్తుత స్థానాన్ని స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నాయి. కేంద్రానికి లోపాయికారీగా మద్దతిస్తూ, బయటకు న్యూట్రల్ అంటూ మాట్లాడే జగన్ వైఖరిని జాతీయ విపక్షాలు ఏమాత్రం విశ్వసించడం లేదు. ఒక ప్రాంతీయ పార్టీగా ఆయన మాటలకు లేదా ట్వీట్లకు విపక్ష కూటమి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతను ఇవ్వడం లేదనేది పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్న మాట. జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమిలో అధికారికంగా చేరలేదు.. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలతోనూ కలవలేదు. ఈ రెండు పడవల ప్రయాణం వైఎస్సార్‌సీపీని దేశ రాజకీయాల్లో ప్రభావశూన్యమైన శక్తిగా మార్చే ప్రమాదముంది.
రాజకీయ బేరసారాలకే పరిమితం: వైసీపీ మద్దతు కేవలం వ్యక్తిగత, న్యాయపరమైన రక్షణల కోసమో లేదా తాత్కాలిక రాజకీయ అవసరాల కోసమో కేంద్రానికి ఇచ్చేది తప్ప, అందులో ఒక నిర్దిష్టమైన సిద్ధాంతం లేదనే అభిప్రాయం పరిశీలకుల్లో బలపడింది.

కామెంట్‌లు లేవు