SSMB30: మహేష్‌తో క్రేజీ డైరెక్టర్.. ఫిక్స్?

 

Mahesh Babu next movie after Varanasi Lokesh Kanagaraj

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో గ్లోబల్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' ( varanasi ). ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు తన వంతు షూటింగ్ పార్ట్‌ను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. సినిమా కోసం పెంచిన పొడవాటి జుట్టు, గడ్డం లుక్‌కు గుడ్ బై చెప్పేసి, ఇటీవల మహేష్ క్లీన్ షేవ్ కొత్త లుక్‌లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే ఈ తాజా మార్పుతో టాలీవుడ్ వర్గాల్లో తన నెక్స్ట్ సినిమాపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.


మహేష్ నెక్స్ట్ సినిమా ఎవరితో? (Mahesh Babu next movie)

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే తన తర్వాతి రెండు మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేస్తుంటారు. కానీ రాజమౌళితో సినిమా అంటే కనీసం రెండు మూడేళ్ల నిరీక్షణ తప్పదు. ఇప్పుడు 'వారణాసి' షూటింగ్ దాదాపు కొలిక్కి రావడంతో తదుపరి చిత్రంపై ఇప్పటివరకు ఆయన ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోవడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. గతంలో అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగా వంటి స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపించినప్పటికీ ఏదీ ఖరారు కాలేదు.


మహేష్‌తో లోకేష్ కనగరాజ్ క్రేజీ ప్రాజెక్ట్!

ఈ క్రమంలోనే సినీ వర్గాల్లో ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ బలంగా వినిపిస్తోంది. 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సృష్టించిన కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ( Lokesh kanagaraj ) దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్నారన్నది అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ గట్టిగా వినిపిస్తున్న మాట.. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక చర్చలు జరిగాయని, మహేష్‌కు లోకేష్ ఒక పవర్‌ఫుల్ లైన్ కూడా వినిపించే పనిలో ఉన్నారని ఇన్సైడ్ టాక్.


బన్నీ ప్రాజెక్ట్ కంటే మహేష్ తోనే?

అయితే లోకేష్ కనగరాజ్ తన తర్వాతి ప్రాజెక్ట్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ తన తాజా చిత్రం 'రాకా' (Rakaa) షూటింగ్‌తో అత్యంత బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్‌లో ఖాళీగా ఉండకుండా, మహేష్ బాబుతో అనుకున్న ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు లోకేష్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ సమాచారం.

ఒకవేళ ఈ కాంబినేషన్ నిజంగానే లాక్ అయితే.. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, లోకేష్ మార్క్ డార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తోడైతే ఇండియన్ బాక్సాఫీస్ మరోసారి రికార్డుల సునామీ చూడటం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంచలన ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.