కూటమితో పొత్తు.. జగన్ లక్ష్యం అదేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు సింహం సింగిల్ గా వస్తుందని చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) భవిష్యత్ వ్యూహాలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని 'ఇండియా' (INDIA Alliance) కూటమితో చేతులు కలిపినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఆ పార్టీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తాజాగా చేసిన అందుకు కారణం. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ, పార్టీ అంతర్గత వ్యవహారాలు, ఢిల్లీ లాబీయింగ్‌లో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
నిన్నటి వ్యూహం.. నేటి అనివార్యత?2029 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో పొత్తు పెట్టుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉంది- విజయసాయిరెడ్డి pic.twitter.com/X1oCkzvapK
— greatandhra (@greatandhranews) September 30, 2026
2014, 2019, 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఎప్పుడూ ఏ కూటమిలోనూ అధికారికంగా చేరలేదు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) అధికారంలో ఉన్న సమయంలో.. రాష్ట్ర ప్రయోజనాల కోసమంటూ పార్లమెంట్‌లో పలు బిల్లులకు వైఎస్సార్‌సీపీ బయటి నుంచే మద్దతు ఇచ్చినప్పటికీ, ఎన్డీయేలో తాము భాగస్వాములం కాదని, ఇటు ఇండియా కూటమితో సంబంధం లేదని జగన్ పదేపదే ప్రకటించారు.
కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడం, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (TDP) ఎన్డీయేలో అత్యంత కీలకమైన భాగస్వామిగా మారడం జగన్‌ను రాజకీయంగా ఇరుకున పెట్టింది.
టీడీపీని ఢీకొట్టాలంటే 'ఇండియా కూటమి' అండ తప్పదా?
ప్రస్తుతం కేంద్రంలోనూ, ఏపీలోనూ కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (JSP), బీజేపీ త్రయం కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఈ బలాన్ని ఒంటరిగా ఎదుర్కొని 2029 ఎన్నికల్లో అధికారంలోకి రావడం వైఎస్సార్‌సీపీకి అంత తేలికైన విషయం కాదు.
కేంద్రంలో ఎన్డీయే భాగస్వామిగా టీడీపీ చక్రం తిప్పుతున్న వేళ, రాష్ట్రంలో వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులు, దర్యాప్తు సంస్థల ఒత్తిడిని తట్టుకోవాలంటే జాతీయ స్థాయి ప్రతిపక్షాల మద్దతు అవసరమని పార్టీ కేడర్‌లో భావిస్తుందట.
కాంగ్రెస్‌తో కలయిక సాధ్యమేనా?:
దివంగత వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేసులు, జగన్ జైలు జీవితం అందరికీ తెలిసిందే. వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్‌గా ఉంటూ జగన్‌పై ప్రత్యక్ష దాడి చేస్తున్నారు. అయినప్పటికీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే నానుడి ప్రకారం.. బీజేపీ-టీడీపీలను జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రంలోనూ ఎదుర్కోవాలంటే ఇండియా కూటమితో చేతులు కలపడమే జగన్‌కు మిగిలిన ఏకైక ఆప్షన్ అని కొందరు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
2029 వైపు జగన్ అడుగులు
గతంలోలా "మేం ఎవరితోనూ కలవం.. ఒంటరిగానే పోరాడతాం" అనే సిద్ధాంతం ప్రస్తుత సంక్లిష్ట రాజకీయ వాతావరణంలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే సందేహాలు వైసీపీలోనే వ్యక్తమవుతున్నాయి. టీడీపీకి ఎన్డీయే బలమైన రక్షణ కవచంగా ఉన్నప్పుడు, వైసీపీకి కూడా జాతీయ స్థాయిలో బలమైన ఇండియా కూటమి అండదండలు అవసరమనేది విశ్లేషకుల మాట.

కామెంట్‌లు లేవు